జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం-యంత్రాంగం సన్నద్ధంగా వుండాలి,కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున అన్ని ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా వుండాలని జిల్లా కలెక్టరు ఆనంద్ అదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షం రాకముందు, వచ్చిన తరువాత చేపట్టాల్సిన చర్యలపై పూర్తిగా సన్నద్ధత కావాలన్నారు. ప్రధానంగా ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువుల స్థితిగతులను పరిశీలించి అవసరమైన చోట చెరువు కట్టల మరమ్మతులు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్‌వో లవన్న, డిఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య, ఇరిగేషన్, విద్యుత్, సోమశిల ఎస్‌ఇలు కృష్ణమోహన్, విజయన్, వెంకటరమణారెడ్డి, జడ్పీ సిఇవో కన్నమనాయుడు, ఉద్యానవనశాఖాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.