నిబంధనలకు విరుద్దంగ వున్న నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయండి- కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం నిర్దేశించిన అనుమతులను ఉల్లంఘిస్తూ జరిగే నిర్మాణాలను ప్రారంభ స్థాయిలోనే ఆపేయాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మాగుంట లే అవుట్, ముత్యాలపాలెం తదితర ప్రాంతాల్లో కమిషనర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న ఒక భవన నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేశారు. అనుమతుల మేరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయా అని కమిషనర్ విచారించి, సిబ్బందితో కొలతలు వేయించారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో మాట్లాడుతూ అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలు జరిగేలా క్రమంతప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను కార్యాలయంలో అందజేయాలని, వారందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ముత్యాలపాలెం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును కమిషనర్ సందర్శించి తాగునీటి నాణ్యతను తనిఖీ చేశారు. క్రమంతప్పకుండా తాగునీటి నాణ్యతను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు.