ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు-మంత్రి నారాయణ
నెల్లూరు: ప్రజల ఆస్తికి భద్రత, రక్షణ కల్పించడమే లక్ష్యంగా భూసమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని 11వ వార్డు ఎన్టీఆర్ నగర్ వార్డు సచివాలయంలో రెవెన్యూ సదస్సును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తూ క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచుకునేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దుచేసి తమ ప్రభుత్వం నూతన చట్టం ల్యాండ్ గ్రాబింగ్`2024ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఇతరుల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే నాన్‌బెయిలబుల్ కింద 10 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, భూమి విలువను చెల్లించేలా నిబంధనలు పొందుపరిచినట్లు మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో ఉండే లోపాలను సరిదిద్ది.. నిజమైన అర్హుడుకే న్యాయం చేసేలా రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వీలైనంత త్వరగా భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.తొలుత అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకుని,అయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళ్లు అర్పించారు.
కలెక్టర్ ఆనంద్:- ప్రజల ముంగిటకే రెవెన్యూ యంత్రాంగం కదిలివచ్చి భూసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడమే రెవెన్యూ సదస్సుల ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు.