అన్ని పత్రాలు సమర్పిస్తే కేవలం 24 గంటల్లో ప్లాన్ పర్మిషన్-మంత్రి నారాయణ
నెల్లూరు: బిల్డింగ్ అనుమతులకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పిస్తే కేవలం 24 గంటల్లో ప్లాన్ పర్మిషన్ ఇచ్చే నూతన విధానాన్ని తీసుకువస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యకలాపాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి నారాయణ, కమిషనర్ సూర్య తేజతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వివిధ లే అవుట్ లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలన్నారు. ప్రజలు కూడా వివిధ రకాల రెవిన్యూ బకాయిలను చెల్లించాలన్నారు. ఇప్పటికే నాలుగు నెలల కాలంలో ఆరున్నర కోట్ల రెవిన్యూ బకాయిలు ప్రజలు చెల్లించారని, వారిని ఆదర్శంగా తీసుకొని మిగతావారు కూడా పెండింగ్లో ఉన్న 120 కోట్ల బకాయిలను చెల్లించాలన్నారు. ప్రజలు చెల్లించిన సొమ్మును తిరిగి ప్రజావసరాలకే వినియోగించాలన్నారు. నగరంలోని పశువుల సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక వాహనం కేటాయిస్తున్నామన్నారు. అలాగే వీధి కుక్కల పునరుత్పత్తికి అవకాశం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యుటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.