రూ.695 కోట్లతో 2025-26 సంవత్సరపు మునిసిపాల్ ఆర్థిక బడ్జెట్ ఆమోదం-మేయర్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ స్రవంతి తెలిపారు. నగర పాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.మేయర్ స్రవంతి అధ్యక్షతన 2025-26 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు ప్రారంభం అయ్యాయి.నగదు నిల్వ రూ.121,30,89,764 కోట్ల రూపాయలతో, జమలు రూ.585,48,20,000 కోట్లతో కలిపి మొత్తం రూ.706,79,09,764 కోట్లు జమలుగా ప్రతిపాదించి దానికి అనుగుణంగా రూ.695,95,46,000 కోట్ల రూపాయల ఖర్చులను అంచనా వేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టి, సభ్యుల ఆమోదంతో కౌన్సిల్ తీర్మానం నెం-437 ద్వారా ఆమోదించారు. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించామని మేయర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను రూపొందించి ఆమోదించామని మేయర్ ప్రకటించారు.ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసీన్, వివిధ డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్య తేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.