హిందూ ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది-మంత్రి ఆనం
నెల్లూరు: సనాతన హైందవ ధర్మం, వేద సంస్కృతి, ఆగమ శాస్త్రాలను కలగలిపి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. సంగం మండలం వంగల్లు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన విశిష్టతగల భీమలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కుంభాభిషేక పూజల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. గ్రామస్తులు, దాతలు ఆలయాన్ని పునర్నిర్మిచుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ఏడు పెద్ద ఆలయాలతో పాటు 6ఎ కేటగిరీకి చెందిన 231 దేవాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం, భక్తి భావం ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఆలయాల్లో రుచికరమైన, నాణ్యమైన ప్రసాదం భక్తులకు అందిస్తామని,. ప్రసాదం తయారీలో ఏ గ్రేడ్ పదార్థాలని వినియోగించేలా ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యం స్కీం ద్వారా ఇచ్చే రూ.5 వేలను ఈ నెల నుంచే రూ 10,000 అందజేస్తున్నామని, రూ 50 వేలకు పైగా ఆదాయం కలిగిన ఆలయాల్లో అర్చకులకు ఇచ్చే రూ.10వేలను రూ. 15వేలుగా అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు.
టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నూతన ఆలయాలకు ఇచ్చే 10 లక్షలు ఆర్థిక సహాయాన్ని 20 నుంచి 25 లక్షలు లోపు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు.