రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో డ్రైన్స్ పూడికతీత పనులు-మంత్రి నారాయణ
నెల్లూరు: రాష్ట్రంలోని పట్టణాల్లో మురికి కాలువల పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.సోమవారం నెల్లూరు 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. విపరీతమైన చెత్త పేరుకుపోయి, మురికి నీళ్లు పోయే మార్గం లేని కాలువలు వెంబడి మంత్రి స్వయంగా పర్యటించి మున్సిపల్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో త్రాగునీటి వసతికి, పారిశుద్ధ్యనికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో డ్రైన్స్ పూడికతీత పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని, అందుకనుగుణంగా రెండవసారి పూడికతీత పనులు చేపట్టామన్నారు. నగరంలోని 6.7 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నింటిలోను పూడికతీత పనులు ప్రారంభించామని,20 రోజుల్లో పనులు పూర్తి అవుతాయన్నారు.