ఈనెల 14వ తేదీ నుంచి 21వ వరకు పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలు-పవన్ కళ్యాణ్
నెల్లూరు: రాష్ట్రంలో ఈనెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నుండి పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలను ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. పల్లె పండుగ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చెక్ డ్యాములు, వాటర్ షెడ్లు, నీటి కుంటలు, సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు, పంటకాలువలకు సంబంధించిన పనులను చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలకు జాతీయ ఉపాధి హామీ నిధులతో పనులు నిర్వహించాలన్నారు. పల్లెపండుగ పంచాయతీరాజ్ వారోత్సవాల్లో జాతీయ ఉపాధి హామీ పనులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేపట్టాలన్నారు.పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలలో చేపట్టే పనులన్నీ కూడా నాణ్యతతో చేపట్టాలని అలాగే పల్లె పండుగలో శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా జనవరి నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పల్లె పండుగ పంచాయతీ రాజ్ వారోత్సవాలు కార్యక్రమాల్లో చేపట్టే పనులన్నింటిని కూడా గ్రామ పంచాయతీలో ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ఓ.ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో పల్లె పండుగ పంచాయతీరాజ్ వారోత్సవాలను ఈనెల 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహించ డానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 57.73 కోట్ల రూపాయలతో ఒక వెయ్యి తొమ్మిది పనులు చేపట్టడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.