ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు-కలెక్టర్.ఆనంద్
నెల్లూరు: ఫీజులు సకాలంలో చెల్లించ లేదని స్టూడెంట్స్ ను వేధించ వద్దని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ చేయ లేదనే కారణంతో క్లాసులకు రానివ్వకపోవడం, ప్రాక్టికల్స్ కు హాజరు కానివ్వక పోవడం,పాస్ సర్టిఫికెట్లు జారీ చేయక పోవడం వంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి వఛాయని, ఫీస్ రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్ధినీ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్‌ను నేరుగా కాలేజీలకు విడుదల చేస్తామని, పాత బకాయిలు కూడా క్రమంగా విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులను ఫీజులు విషయమై వేధించరాదని కలెక్టర్ కోరారు. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపల్స్ తో విద్యాశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై విద్యార్థులను తరగతులకు హాజరు కానివ్వడం లేదని లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానివ్వలేదని, పాస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని జిల్లాలో ఎక్కడైనా ఫిర్యాదు అందితే, సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు.