మరో వెయ్యేళ్ళు గడిచిన రామాయణ మహాకావ్యం ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది-కలెక్టర్
నెల్లూరు: భారతజాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచే గొప్ప భావజాలం గల మహాకావ్యం రామాయణమని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వాల్మీకి మహర్షి జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలంకరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతజాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచే గొప్ప మహాకావ్యం రామాయణమని, అటువంటి సుందర కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. రామాయణాన్ని ప్రతి ఒక్కరూ చిన్నప్పటినుండి వింటూ ఉంటారని, కానీ జీవితంలో ఎదిగే కొద్దీ రామాయణ మహాకావ్య స్ఫూర్తి అందరికీ అర్థమవుతుందన్నారు. భారతదేశంలోని ప్రతి గ్రామంలో రామాయణ ఇతిహాస గాధ విన్పిస్తూ ఉంటుందన్నారు. దేశమంతటిని ఒకటిగా నిలిపే శక్తి రామాయణ మహాకావ్యానికే ఉందన్నారు. మరో వెయ్యేళ్ళు గడిచినప్పటికీ రామాయణ మహాకావ్యం ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఎక్కువగా పేద పిల్లలు ఉంటారని, అటువంటి వసతి గృహాలను అభివృద్ధి చేయడానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా కృషి చేస్తామన్నారు.