సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు-డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక
1,549 కేసులు నమోదు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా సంబంధిత కేసులను సమీక్షించి, చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయడంపై కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. WhatsApp, Facebook, X, Instagram వేదికల్లో కొందరు వ్యక్తులు-వ్యవస్థీకృత బృందాలు అవమానకర వ్యాఖ్యలు, రాజకీయ ప్రేరిత పోస్టులు, సామాజిక ఉద్రిక్తతలు రేకెత్తించే సందేశాలు, తప్పుడు ప్రచారం-వదంతులను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇవి ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలుగా పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా“Zero Tolerance” విధానాన్ని కఠినంగా అమలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ 1,549 కేసులు నమోదు చేసి, 1,344 మందికి పైగా అరెస్టులు చేసినట్లు వెల్లడించారు. అదనంగా 4,529 చట్టవిరుద్ధ పోస్టులను తొలగించినట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు Information Technology Act, 2000-Bharatiya Nyaya Sanhita, 2023 కింద తీసుకుంటున్నారు. ఇందులో Section 111 (organised crime) వంటి కఠిన నిబంధనలు కూడా వర్తింపజేస్తున్నారు.
అదేవిధంగా, Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 నిబంధనల ప్రకారం, నిందితులు ఉద్దేశపూర్వకంగా విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే పరిస్థితుల్లో కూడా ‘trial in absentia’ విధానం అమలు చేయబడుతుంది. కోర్టు సమన్లు, వారెంట్లు జారీ అయినప్పటికీ హాజరు కాకపోతే, వారి గైర్హాజరీలోనే విచారణ కొనసాగించి తీర్పు ఇవ్వబడుతుంది. దీని ద్వారా న్యాయ ప్రక్రియ ఆలస్యం కాకుండా కొనసాగించబడుతూ, నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూస్తాం. పదే పదే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు-వ్యవస్థీకృత గ్రూపులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సంఘటిత నేరాలకు సంబంధించిన చట్టాలను కూడా ప్రయోగిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. నకిలీ అకౌంట్లు, గోప్యత పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు చేసినా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.అధునాతన సాంకేతికతతో ప్రత్యేక సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి, AI విశ్లేషణ, రియల్ టైమ్ పర్యవేక్షణ, డిజిటల్ ఫోరెన్సిక్ పద్ధతులతో నేరాలను వేగంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఏదైనా సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల్లో పంచుకునే ముందు ధృవీకరించుకోవాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

