AP&TGOTHERSSPORTS

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి రూ.170 కోట్లతో భారీ ప్రణాళిక-మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అమరావతిలో నేషనల్ గేమ్స్..

అమరావతి: రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి నగరం, పట్టణం, గ్రామాల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా నిధులు రూ.19 కోట్ల వ్యయంతో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియం లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఎంతో భావోద్వేగ అనుబంధం కలిగిన IGMC స్టేడియం అభివృద్ధిని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు మరలా ప్రాధాన్యత పెరిగిందని, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వసతుల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయవాడలోని IGMC స్టేడియం అభివృద్ధికి మొత్తం సుమారు రూ.160 నుండి రూ.170 కోట్ల వరకు మూడు దశల్లో వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఖేలో ఇండియా ద్వారా రూ.20 కోట్లు, శాప్ ద్వారా రూ.20 కోట్లు, మిగిలిన నిధులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరనున్నాయని వెల్లడించారు.

పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ అమరావతిలో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.2029 నాటికి విజయవాడ, అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పార్లమెంటు సభ్యులు చెప్పారు.

శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ ఎంపీ సూచనల మేరకు స్టేడియంలో ఒక బ్లాక్‌కు ప్రముఖ మహిళా క్రీడాకారిణి పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియం పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని, అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యేలు,జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం. ధ్యానచంద్ర,, శాప్ వీసీ అండ్ ఎండీ ఎస్. భరణి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *