ఈవీ బస్సులతో రవాణా వ్యయం తగ్గేలా చర్యలు-ముఖ్యమంత్రి చంద్రబాబు
రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ..
అమరావతి:- రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే… వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర రేపేర్లు చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే… వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు.
పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యత:- “రాష్ట్రంలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను కనెక్ట్ చేసేలా పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ అలానే ఉంది. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్ గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఈ రకమైన కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి.
ఈవీలతో తక్కువ రవాణా వ్యయం:- “అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి రావాలి. దీనికి ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గం. క్లీన్ ఫ్యూయెల్ వినియోగం ఎక్కువ జరిగితే ఖర్చు తగ్గుతుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. సోలార్ పవర్ ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను సుమారు రూ.1 మేర తగ్గించ గలిగాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ విధానంపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ.72 వ్యయం అవుతోంది. వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలను ఆపరేట్ చేయాలి. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ లాంటి అంశాలను పరిశీలించాలి. అన్నీ కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలి. ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రమోట్ చేయాలి. ఈ-సైకిళ్లు మాస్ ట్రాన్ పోర్టుగా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పించాలని” సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

