దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి-వైసీపీ నాశనం చేస్తే మేం శాసనం చేశాం-సీఎం చంద్రబాబు
దేశమంతా మద్దతిస్తే వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది..
ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు,కదల్చలేరు..
వైసీపీ హయాంలో30 ఏళ్లు వెనక్కు వెళ్లాం..
అమరావతి: ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై మద్దతు పలికితే ఒక్క వైసీపీ ఎంపీలు మాత్రమే వ్యతిరేకించి వాకౌట్ చేశారని వ్యాఖ్యానించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం, రాజధాని ఏర్పాటు, అమరావతి ఎంపిక, వైసీపీ కుట్రలు, రాజధాని రైతుల ఉద్యమం, అసెంబ్లీ, మండలిలో జరిగిన పరిణామాలు, న్యాయ పోరాటం, రాజధాని పునర్నిర్మాణం వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్దత వస్తుంది. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి భవిష్యత్ నగరం:- “భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొట్టతొలి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అందుకే ఈ తీర్మానం పెట్టి పార్లమెంటుకు పంపితే.. దానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగం, విజ్ఞానం లాంటి అంశాలకు నెర్వ్ సెంటర్ గా అమరావతి మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్ సిటీ కూడా అవసరం.. అదే అమరావతి. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖ, తిరుపతి లాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. 2028 నాటికి రాజధానిలో ప్రధాన మైన పనులన్నీ ఓ కొలిక్కి వస్తాయి.
బుద్ది మార్చుకోని వైసీపీ:- “ప్రజలు, దేశం యావత్తూ అమరావతి వైపు ఉంటే…వైసీపీ నేతలు ఇంకా అహంకారం ప్రదర్శిస్తున్నారు. ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందితే ఓర్వలేక పోతున్నారు. ఎక్కడ కూర్చొంటే అక్కడే రాజధాని ఏమిటి…? పార్లమెంటు ఓ చట్టం చేస్తే దానిని అమలు చేయాల్సిన రాజకీయ పార్టీలు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా మంటే ఎలా…? ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ మాట్లాడటం ఏమిటి..? ప్లాన్ ఏలో మూడు ముక్కలాటలు, ప్లాన్ బీలో మావిగన్. ఇలాంటి విపరీత మనస్తతత్వం ఏమిటి..? దేశమంతా ఆంధ్రప్రదేశ్ కు మద్దతు పలికి అమరావతి నిర్మాణం కావాలని, దేశాభివృద్ధికి దోహదం చేయాలని సంఘీభావం తెలియచేశారు.
కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది:- “ప్రపంచం అంతా ఒకవైపు మాట్లాడితే… ఒక పార్టీ, వ్యక్తి మాత్రం వేరే విధంగా మాట్లాడుతున్నారు. అమరావతి అని పలకటం కూడా వారికి ఇష్టం లేదు. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో విభజన హామీల్లో ఒక్కటీ సాధించ లేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి, అమరావతికి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు, రైల్వే జోన్ కు, రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ కు నిధులు సాధించగలిగాం. డబుల్ ఇంజన్ సర్కారుగా కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేస్తున్నాం. ఏపీకి రావాల్సిన నిధులన్నీ వస్తూనే ఉన్నాయి. విభజన కంటే ఏపీకి జరిగిన నష్టం వైసీపీ హయాంలోనే ఎక్కువ జరిగింది.30 ఏళ్లు వెనక్కు వెళ్లాం. అంతకు ముందు పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదం పొందటంపై ముఖ్యమంత్రికి మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

