DISTRICTS

నెల్లూరు రూరల్ లో 240 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం

స్వశక్తితో ఎదిగిన నాయకుడు కోటంరెడ్డి..

నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా..

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల సమష్టి కృషితో రూ.27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, శ్రీరామనవమికి ముందుగానే నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

29 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం:- దేవాదాయశాఖ పరంగా రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 29 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతి నెలా ₹10,000 చొప్పున సహాయం అందిస్తున్నామని చెప్పారు. నాలుగు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ₹10.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు

నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా:- రాష్ట్రంలో జనగణన అనంతరం డీలిమిటేషన్ ప్రకారం అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందని సూచించారు. కష్టపడి పని చేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ₹613 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో భూగర్భ డ్రైనేజీకి ₹500 కోట్లు, ప్రస్తుతం ₹140 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన, టెండర్ దశలో ఉన్న, ప్రారంభించబోయే పనులు కలిపి ₹613 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కొండాయపాలెం గేట్, బీవీనగర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు ₹31 కోట్లు మంజూరు చేసినట్లు, త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ అజయ్, నగర మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ భాను శ్రీ,  స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *