DISTRICTS

గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు-జాయింట్ కలెక్టర్

నెల్లూరు: గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్  నిల్వలు సరిపడ ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్  మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి లీలారాణితో కలిసి గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైనంత ఎల్పిజి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఒక విఆర్ఓ ను, ఒక కానిస్టేబుల్ ను నియమించి గ్యాస్ డెలివరీ ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డీలర్లు కూడా ప్రతిరోజు స్టాక్ వివరాలు, బుకింగ్ స్టేటస్, డెలివరీ స్టేటస్ మొదలైన వివరాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. జిల్లాస్థాయిలో గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా అరికట్టేందుకు, ప్రజలకు పారదర్శకంగా గ్యాస్ సిలిండర్లను అందేలా నిరంతర పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు చేసి వివరించారు.

జిల్లాలో గ్యాస్ కొరతపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని,  వదంతులను ప్రజలు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు సమయానికి అందేలా ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ వంటి చర్యలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు లేదా అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని, అందరికీ గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ పి, భారత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *