కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మొక్కలకు జియో ట్యాగింగ్
అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నాం. అలాగే రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటపుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నాం. పర్యావరణ ప్రేమికుడిగా ఈ విషయంలో అన్ని వైపులా ఆలోచించి పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం చర్యలు తీసుకోవడమే కాదు.. భవిష్యత్తులోనూ చెట్లను, వృక్షాలను సంరక్షించేలా బలమైన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. ఇది కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి భరోసా దొరుకుతుంది.
నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్:- అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేవాటికి, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నాం. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తాం. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నాం. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. ఎర్ర చందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకాలను చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు ఎప్పటికప్పుడు గ్లోబల్ ధరలకు అనుగుణంగా దుంగలకు వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు మంచి ధరలు వచ్చేలా ప్రయత్నం చేస్తారని తెలిపారు.

