26 ఆట్రిబ్యూట్స్ తో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలి-ముఖ్యమంత్రి
అమరావతి: ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్(FBMS)పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్లో బుధవారం సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్-రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 ఆట్రిబ్యూట్స్ తో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్‌జీఎస్‌డబ్ల్యు, డిస్కమ్స్, ఎంఏయూడీ, వెబ్‌ల్యాండ్, వాహన్, హెచ్ఆర్ఎంఎస్, సీబీడిటీల, పంచాయతీరాజ్, మార్క్ ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని సూచించారు. ఇప్పటికే 82 శాతం సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

