AP&TGHEALTHOTHERS

దేశంలోనే మొదటి ప్రెసిషన్ అంకాలజీ పరిశోధనకు ఒప్పందం

సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ..

ఊపిరితిత్తుల కాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు..

అమరావతి: కాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ద్వారా వైద్య చికిత్సలను అందించేందుకు వీలుగా కీలకమైన ముందడుగు పడింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్యశాఖ- ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రిలయన్స్‌ కు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూఆర్ఏఐ సంస్థలతో కలిసి ఆస్ట్రా జెనెకా ఇండియా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.

అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించేందుకు ఈ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్‌ను ఆస్ట్రా జెనెకా ఏర్పాటు చేయనుంది. అమరావతి క్వాంటం వ్యాలీ- ఆస్ట్రా జెనెకా ఇండియా భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆధునిక జన్యుచికిత్సా విధానాల్ని వినియోగించి కాన్సర్ ప్రారంభదశలోనే గుర్తించి శరీర తత్వానికి అనుగుణంగా చికిత్స అందించేలా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ విధానం ఉపకరించనుంది.

ఊపిరితిత్తుల కాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఎక్స్ రే ఆధారిత వ్యవస్థను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనుంది. తద్వారా రోగులను వేగంగా స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలు అందటం తో పాటు ఎలాంటి జాప్యం లేకుండా చికిత్స చేసేందుకు వీలుగా మార్గం సుగమం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎస్ జి.సాయి ప్రసాద్, ఆస్ట్రాజెనెకా ఇండియా ఎండీ ఏ. ప్రవీణ్ రావు , స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థల ప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *