AP&TGMOVIESOTHERS

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తొలినాళ్లలో హీరోగా నటించినప్పటికీ, ఆ తర్వాత విలన్‌గా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా విభిన్న పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు.

నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. జయభేరి పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన వారసత్వాన్ని కుమారుడు, ప్రముఖ నటుడు రఘుబాబు కొనసాగిస్తున్నారు. గిరిబాబు మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *