ఈ నెల 26 నుంచి జూలై 24 వరకు ఆషాడమాస బోనాలు-మంత్రులు కొండ సురేఖ,ప్రభాకర్
బోనాల నిర్వహణకు 20 కోట్లు మంజూరు…
హైదరాబాద్: ఈనెల 26 నుంచి జూలై 24 వరకు నిర్వహించే ఆషాడ మాస బోనాలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ పొన్నం ప్రభాకర్,,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ , రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుందని, జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20న సింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జి మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాలను లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని అందులో దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మిగతా 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఏనుగు అంబారీ ఊరేగింపు జూలై 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో,20న శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం సబ్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం అంబారీ ఏనుగు ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ఆషాడ బోనాలు ఢిల్లీ తో పాటు విజయవాడలో కూడా నిర్వహించనున్నట్లు అలాగే భ్రమరాంబ శ్రీశైలం దేవాలయాలను కూడా బోనాల ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి అధికారుల ఆదేశించారు.