ఇంటి పన్నులపై రివిజన్ సర్వేను ఈనెల 15 లోపు పూర్తి చేయండి-కమిషనర్ నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో టాక్స్ రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని కమిషనర్ వై.ఓ నందన్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు. రెవెన్యూ సెక్షన్ వారాంతపు సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు ప్రతి అడ్మిన్ కార్యదర్శి సచివాలయ ఇతర కార్యదర్శులను సమన్వయం చేసుకుని ఇంటింటి ట్యాక్స్ రివిజన్ సర్వేను ఈనెల 15వ తేదీ నాటికి వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఉదయం 6 గంటల నుంచి రీ సర్వే ప్రారంభించి గృహాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేయాలని, నివేదికలను గూగుల్ షీట్స్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. సచివాలయాల మేరకు నిర్దేశించిన సర్వే రివిజన్ లక్ష్యాలను అడ్మిన్ కార్యదర్శుల ద్వారా పూర్తి చేయించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు, విధులలో మెరుగైన పనితీరు కనబరచని వారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలలో అలసత్వం వహించిన కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సూపరింటెండెంట్ నరేంద్ర, రెవెన్యూ అధికారులు శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.