చైనా తూర్పు తీరంవైపు నుంచి దూసుకుని వస్తున్న “బావి” తుఫాను
అమరావతి: గంటకు 162 కిలోమీటర్ల గరిష్ట వేగంతో చైనా తూర్పు తీరంవైపు “బావి” తుఫాను దూసుకుని వస్తోందని బీజింగ్ లోని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో వాతావరణ శాఖ గురువారమే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం తుఫాను మొదట తైవాన్‌ను తాకి అనంతరం చైనాలోని ఫుజియన్, జెజియాంగ్ ప్రావిన్సుల్లో తీరాన్ని తాకనుంది. తుఫాన్ ప్రభావిత ప్రావిన్సుల్లో 40 సెంటీమీటర్ల వరకూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
అప్రమత్తమైన చైనా ప్రభుత్వం:- బావి తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరానికి సమీపంలోని 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.1.70 లక్షల మంది విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. తీర ప్రాంతాలతో పాటూ బీజింగ్ వరకూ తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే రాజధాని బీజింగ్‌లో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. క్రీడాకార్యక్రమాలను వాయిదా వేశారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, గాలులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
మొదట తైవాన్‌కు ఉత్తరంగా వెళుతుందని అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు, దీనివల్ల 23 మిలియన్ల జనాభా ఉన్న ఆ ద్వీపంలో శుక్రవారం రాత్రి నుంచే శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. తైవాన్‌లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. గ్రేటర్ బే ఎయిర్‌లైన్స్ కూడా పలు విమాన సర్వీసులను నిలిపివేసింది. మిగిలిన విమానాలను దారి మళ్లించింది.

