కార్తీక మాస భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
వైభవంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం..
అమరావతి: పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను నిలిపివేసి, భక్తులందరికీ ముఖమండపం నుంచి దర్శనం కల్పించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు:- ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ వైపు నుంచి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాల ద్వారా ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. క్యూలైన్లలో భక్తులకు నిరంతరం తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా ఉచిత ప్రసాదం, నిత్య అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఇంద్రకీలాద్రిపై క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను సంయుక్తంగా పరిశీలించారు.
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం..
పవిత్ర షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

