AP&TGDEVOTIONALOTHERS

కలియుగ బ్రహ్మాండం-ఎస్వీ మ్యూజియం

నవంబర్ 16 నుంచి సాధారణ భక్తుల సందర్శనకు..

తిరుమల చరిత్రకు సరికొత్త వైభవం..

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 14 అద్భుత గ్యాలరీలు

అన్నమయ్య సంకీర్తనల నుంచి ఆధ్యాత్మిక సంగీతం వరకు..

హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్..

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు.. భక్తులు ఆరాధిస్తున్న శ్రీవారి దివ్యక్షేత్ర విశిష్టతను, వేల సంవత్సరాల చారిత్రక వారసత్వాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే చోట ఆవిష్కరించే అద్భుత వేదికగా తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం రూపుదిద్దుకుంది.

లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 14 అద్భుత గ్యాలరీలు:-

తిరుమలలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. సుమారు 8,000కు పైగా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు, అరుదైన సంపదతో పాటు డిజిటల్ ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.

అన్నమయ్య సంకీర్తనల నుంచి ఆధ్యాత్మిక సంగీతం వరకు:- తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన వేలాది సంకీర్తనలు శ్రీవారి భక్తి వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. అన్నమయ్య, నాణేల చరిత్రకు సంబంధించిన గ్యాలరీతో పాటు సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శన కూడా మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారతీయ సంగీతం, నృత్యం, శిల్పకళల సమ్మేళనాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు మన కళా వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేస్తాయి.

బ్రహ్మాండం గ్యాలరీ:- ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది బ్రహ్మాండం గ్యాలరీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన ఈ గ్యాలరీలో విశ్వం, సృష్టి రహస్యాలు, బ్రహ్మాండ విస్తృతి వంటి అంశాలను వినూత్నంగా ఆవిష్కరించనున్నారు. హోలోగ్రాఫిక్ ప్రదర్శనలు, 360 డిగ్రీల సౌండ్ అనుభూతి, డిజిటల్ విజువల్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. సాధారణంగా పుస్తకాల్లో చదివే విశ్వ సంబంధిత అంశాలను దృశ్యానుభూతి ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించడం ఈ గ్యాలరీ ప్రత్యేకత.

భావితరాలకు తిరుమల వారసత్వ సంపద:- నేటి తరానికి తిరుమల చరిత్రను పరిచయం చేయడంతో పాటు భావితరాలకు అపురూపమైన వారసత్వ సంపదను అందించడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులు, కళాభిమానులకు ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడనుంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల క్షేత్ర చరిత్ర, ఆలయ సంప్రదాయాలు, శిల్పకళా వైభవం, సనాతన సంస్కృతిని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ మ్యూజియం చక్కని అవకాశాన్ని కల్పించనుంది.

నవంబర్ 16 నుంచి సాధారణ భక్తుల సందర్శన:- అందుబాటులోకి రానున్న ఈ మ్యూజియానికి ప్రవేశ రుసుమును రూ.50గా టీటీడీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు మ్యూజియంను సందర్శించవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు కేటాయించడం జరుగుతుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *