AP&TG

ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఏపీలో రెట్టింపైన జాతీయ రహదారులు..

బెంగళూరు–కడప–విజయవాడ కారిడార్‌..

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.32 వేల కోట్లు..

ఇంధనాలతో రైతులకు ప్రయోజనం..

విశాఖపట్నం: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రపంచస్థాయి రహదారి మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రూ.3 లక్షల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం ‘రోడ్స్ టు వికసిత్ భారత్: హైవేస్, లాజిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారిడార్’ అంశంపై ఆయన ప్రసంగించారు.

ఏపీలో రెట్టింపైన జాతీయ రహదారులు:- 2014లో ఆంధ్రప్రదేశ్‌లో 4,100 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల నెట్‌వర్క్ 2026 నాటికి 8,700 కిలోమీటర్లకు చేరిందని గడ్కరీ వివరించారు. రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.60 వేల కోట్లతో 4,750 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రూ.లక్ష కోట్లతో 2,500 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయని, త్వరలో మరో రూ.1.20 లక్షల కోట్లతో 4,600 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

బెంగళూరు–కడప–విజయవాడ కారిడార్‌:- బెంగళూరు–కడప–విజయవాడ కారిడార్‌ను రూ.14 వేల కోట్లతో 340 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నామని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీంతో ప్రయాణ సమయం 12 గంటల నుంచి నాలుగు గంటలకు తగ్గనుంది.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.32 వేల కోట్లు:- ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలను అనుసంధానిస్తూ రూ.32 వేల కోట్లతో 195 కిలోమీటర్ల మేర అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించనుందని గడ్కరీ వెల్లడించారు.

ఇంధనాలతో రైతులకు ప్రయోజనం:- ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌, ఇథనాల్‌, బయోడీజిల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామని గడ్కరీ తెలిపారు. రైతులు పంటలతో పాటు బయోమాస్‌ నుంచి సీఎన్‌జీ, ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తూ ఇంధనదాతలుగా ఎదుగుతున్నారని ప్రశంసించారు.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *