DISTRICTS

ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహక నగదు పారితోషికం-జిల్లా కలెక్టర్

జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు..

నెల్లూరు: గ్రామాల్లో సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, ఎన్నికల సమయంలో వర్గ విభేదాలు, వివాదాలకు తావులేకుండా ఏకాభిప్రాయంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని ప్రోత్సహించడం, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు అందించే ఆర్థిక ప్రోత్సాహక నగదు పారితోషికాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నెం.1111, తేదీ 13.11.2026 ప్రకారం, 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన పెంచిన ప్రోత్సాహక నగదు పారితోషికం అందించనున్నారు.

జనాభా ప్రాతిపదికన అందించే ప్రోత్సాహక పారితోషికం వివరాలు:-

  1. 5,000 లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు.
  2. 5,001 నుంచి 10,000 వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు.
  3. 10,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు.

గతంలో 2,000 లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు, 2,001 నుంచి 5,000 వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, 5,001 నుంచి 10,000 వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 10,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల ప్రోత్సాహక పారితోషికం అమల్లో ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ మొత్తాలను గణనీయంగా పెంచుతూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్రోత్సాహక పారితోషికం పొందేందుకు సర్పంచ్, గ్రామ పంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు సంబంధిత ఎన్నికల అధికారులచే చట్టబద్ధమైన ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారికంగా ఏకగ్రీవంగా ప్రకటించబడి ఉండాలి. సంబంధిత అర్హతలను అధికార యంత్రాంగం పరిశీలించి ధ్రువీకరించిన అనంతరం నిధులు విడుదల చేస్తారు.

గ్రామాల్లో ఐక్యత, సామరస్యం, పరస్పర సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏకగ్రీవ ఎన్నికలు దోహదపడతాయని, ప్రభుత్వం పెంచిన ఈ ప్రోత్సాహక పారితోషికాన్ని గ్రామ పంచాయతీలు సద్వినియోగం చేసుకొని మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్లా సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *