AP&TG

RTGS నుంచి తుఫాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

మురసు తుఫాను ప్రభావం తక్కువే కాని భారీ వర్షాలకు అవకాశం

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలి..

50 టీఎంసీల వరకు వరద ప్రవాహాలు వచ్చే అవకాశం..

అమరావతి: అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తుఫాను ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావంతో వచ్చే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్లను నింపాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని సీఎం తెలిపారు. గత తుఫాను సమయంలో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లుగానే, మురసు తుఫానును కూడా సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.

మురసు తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాలు…?

– పల్నాడు జిల్లాలో 30 సెం.మీ.

– ప్రకాశం జిల్లాలో 24 సెం.మీ.

– మార్కాపురం జిల్లాలో 19 సెం.మీ.

– కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెం.మీ.

– ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో 9 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో డ్రెయిన్లను ముందుగానే శుభ్రం చేయాలని, వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

50 టీఎంసీల వరకు వరద ప్రవాహాలు:- నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 30 నుంచి 50 టీఎంసీల వరకు వరద ప్రవాహాలు రావచ్చని అధికారులు అంచనా వేశారు. పులిచింతలలో 18 టీఎంసీల మేర ఫ్లడ్ కుషన్ అందుబాటులో ఉందని, నాగార్జునసాగర్‌కు కూడా భారీగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నందున చెరువులు, రిజర్వాయర్లను నింపాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్‌లోని జలాశయాల్లో నీటిని నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక దృష్టి:- మురసు తుఫాను ప్రభావం ఉండే ఆరు జిల్లాల పరిధిలోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. సాగునీటి సంఘాలను క్రియాశీలం చేసి ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

ప్రతి రెండు గంటలకు పరిస్థితిపై సమీక్ష:- వర్షాలు, గాలులు, వరద ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తుఫాను అనంతర పునరుద్ధరణ పనులను 48 గంటల్లో పూర్తి చేయాలని, పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, వ్యవసాయ, జలవనరులు, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *