మురసు తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో 14 NDRF బృందాల మోహరింపు
(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, బాధితులకు సకాలంలో సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు 10వ బెటాలియన్ NDRF కమాండెంట్ వి.వి.ఎన్. ప్రసన్న కుమార్ తెలిపారు. ముందస్తు సంసిద్ధత, అంతర్రాష్ట్ర సమన్వయం, ప్రత్యేక శిక్షణతో కూడిన రక్షణ బలగాల ద్వారా మురసు తుఫాను ముప్పును ఎదుర్కొనేందుకు NDRF సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.)
అమరావతి: మురసు తుఫాను ముంచుకుని వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నిర్వహణ, సహాయక చర్యలను జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) మరింత బలోపేతం చేసింది. తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో మొత్తం 14 NDRF బృందాలను మోహరించింది.
వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 11 బృందాలు, తమిళనాడు నుంచి అదనంగా మూడు బృందాలను రప్పించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గాలింపు, రక్షణ చర్యలు చేపట్టడం వంటి విధుల్లో ఈ బృందాలు పాల్గొననున్నాయి.
ముందస్తుగా బలగాల మోహరింపు :- తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు పరిశీలనలు నిర్వహించి, స్థానిక భౌగోళిక పరిస్థితులు, రహదారులు, రాకపోకల మార్గాలను NDRF బృందాలు అంచనా వేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తుగా బలగాలను మోహరించారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు:- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ప్రత్యేక సహాయం అవసరమైన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది, జల రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచారు. తుఫాను అనంతరం కూలిన చెట్లు, శిథిలాలు, రహదారులపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించనున్నారు. బాధితులకు వైద్య ప్రథమ చికిత్స, అత్యవసర సహాయం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

