AP&TG

రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లు-ముఖ్యమంత్రి చంద్రబాబు

18.7 శాతం వృద్ధి..

అమరావతి: రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.11,738 కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని, మొత్తం 18.7 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1,27,506 కోట్లలో ఇప్పటికే 58 శాతం సాధించినట్లు వెల్లడించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.53,692 కోట్ల నుంచి రూ.63,796 కోట్లకు పెరిగింది. వాణిజ్య పన్నుల్లో 18.3 శాతం, జీఎస్టీ ఆదాయంలో 18.1 శాతం వృద్ధి నమోదైంది. ఎక్సైజ్ శాఖ ఆదాయం స్పెషల్ మార్జిన్‌తో కలిపి రూ.20,083 కోట్లకు చేరింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,020 కోట్లు, రవాణా శాఖ ద్వారా రూ.3,649 కోట్లు, గనులు, భూగర్భ శాఖ ద్వారా రూ.2,086 కోట్ల ఆదాయం సమకూరింది.

పన్నేతర ఆదాయం రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు పంచాయతీల ద్వారా రూ.238 కోట్లు, పట్టణ స్థానిక సంస్థల ద్వారా రూ.2,365 కోట్ల పన్ను ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలతో ఆదాయ లీకేజీలు తగ్గాయని, వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దడం ద్వారా శాఖల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా, కొత్త ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ శాఖల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *