AP&TGMOVIESOTHERS

దశాబ్దం తరువాత కళాకారుల కోసం కదిలిన నంది

నంది అవార్డుల వేడుకలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా..

రూ.15.28 కోట్లకు పైగా నిధుల మంజూరు..

2012–2025 వరకు సినిమా, టీవీ పురస్కారాలు..

దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పురస్కారాలు..

అమరావతి: తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక నంది అవార్డుల వేడుకల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ సంవత్సరాల పురస్కారాలను ఒకేసారి ఘనంగా ప్రదానం చేసేందుకు రూ.15.28 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ వేడుకల్లో 2012 నుంచి 2025 వరకు నంది సినిమా, టెలివిజన్ అవార్డులతో పాటు 2017–2025 సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగం రాష్ట్ర పురస్కారాలు, 2025 నంది నాటకోత్సవ అవార్డులు, 2026 కందుకూరి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

రెండు విభాగాలుగా నిధుల కేటాయింపు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. ఆర్థిక శాఖ సమ్మతితో నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. వేడుకల ఏర్పాట్లు, లాజిస్టిక్స్ తదితర ఖర్చుల కోసం 2026–27 బడ్జెట్ అంచనాల నుంచి త్రైమాసిక నిబంధనలను సడలిస్తూ రూ.5 కోట్ల వరకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారాలు, జ్యూరీ సభ్యుల పారితోషికాలు, నంది జ్ఞాపికలు, ప్రత్యేక జ్ఞాపికల తయారీ, ఇతర ఖర్చుల కోసం సంస్థ పీడీ ఖాతాలోని నిల్వల నుంచి మరో రూ.9.61 కోట్ల వరకు వినియోగించుకునేందుకు అనుమతించింది.

నాలుగు విభాగాల్లో పురస్కారాలు:- ప్రభుత్వ నిర్ణయంతో ఒకేసారి నాలుగు విభాగాల్లో అవార్డుల వేడుకలు నిర్వహించనున్నారు. 2012 నుంచి 2025 వరకు 14 సంవత్సరాలకు సంబంధించిన ఏపీ రాష్ట్ర నంది సినిమా, టీవీ అవార్డులు ప్రదానం చేస్తారు. 2017 నుంచి 2025 వరకు జాతీయ చలనచిత్ర అవార్డుల విభాగంలో రాష్ట్ర పురస్కారాలు, 2025 నంది నాటకోత్సవ అవార్డులు, 2026 కందుకూరి పురస్కారాలను కూడా అందజేయనున్నారు.

రావత్‌కు బాధ్యతలు:- ఈ ప్రతిష్టాత్మక వేడుకలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌ను ఓవరాల్ ఇన్‌ఛార్జ్‌ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకల నిర్వహణకు అవసరమైన చోట పర్యాటక శాఖ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు చేపట్టాలని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఎండీని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశించారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని సినీ, టెలివిజన్, నాటక రంగ కళాకారుల్లో ఈ నిర్ణయం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *