AP&TG

రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్-ముఖ్యమంత్రి

500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాల విస్తరణ..

బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు..

ఉల్లి, టమాట ధరలు రానున్న రోజుల్లో..

అమరావతి: నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు ఊరట కలగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రానున్న ఏడాదిన్నర పాటు నిరంతరం మార్కెట్ ధరలను, ద్రవ్యోల్బణాన్ని బేరీజు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

రేషన్ ద్వారా కందిపప్పు… పామాయిల్‌ను ఎప్పటి నుంచి సరఫరా చేస్తారని సీఎం చంద్రబాబు అధికారులను అడిగారు. రేషన్ దుకాణాల ద్వారా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలపడంతో… జాప్యం కావడానికి వీల్లేదని… డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.100కే వినియోగదారులకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే టెండర్ల ద్వారా సేకరించిన ఫోర్టిఫైడ్ పామాయిల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో లీటరు రూ.125కే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇక కందిపప్పు ధరను ఇంకా అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందులను సరఫరా చేయడంతోపాటు… రాష్ట్రంలో కందిపప్పు ఉత్పత్తి, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేలా కంది సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. కంది సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేయాలన్నారు.

ధరణి బియ్యానికి పెరిగిన ఆదరణ:- ధరణి బ్రాండ్ పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న 26 కిలోల బస్తా సూపర్-ఫైన్ బియ్యానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు వివరించారు. మార్కెట్లో కిలో రూ.76 ఉన్న KNM/RNR బియ్యాన్ని రూ.50కే, రూ.66 ఉన్న BPT ముడి బియ్యాన్ని రూ.49కే అందిస్తుండగా ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం 286 కేంద్రాల్లో ఈ విక్రయాలను జరుపుతున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ విక్రయ కేంద్రాలను 500 కేంద్రాలకు విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బియ్యం సహా వివిధ నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఉల్లి, టమాట ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అగ్రి‌వాచ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కూరగాయల ధరలు కూడా ఎంత మాత్రం పెరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అగ్రివాచ్ డేటా, వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *