రోగులకు మెరుగైన వైద్య సేవలను GGH అందించాలి-కలెక్టర్
నెల్లూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి వైద్యులు, అధికారులు అందరూ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. శుక్రవారం GGH కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మౌలిక వసతులు, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో బయోమెడికల్ వ్యర్ధాల సేకరణకు ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, నెల్లూరు మున్సిపాలిటీ వారు సేకరించే సాధారణ చెత్తతో ఈ బయో వ్యర్ధాలు కలవకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయో వ్యర్ధాలు సాధారణ కాలువల్లో వదలకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్:- GGHలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బ్లడ్ బ్యాంకును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.ఓపి కౌంటర్ ను పరిశీలించి రోగులకు అందిస్తున్న ఓపీ స్లిప్పులను, డేటా ఎంట్రీని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆర్థోపెడిక్ విభాగాన్ని, ఆర్థోపెడిక్ పురుషుల, మహిళల వార్డులను పరిశీలించారు. డయాలసిస్ సెంటర్ ను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవలో ఏమైనా లోపం ఉందా, వైద్యులు సక్రమంగా చూస్తున్నారా, ఆస్పత్రిలో చేరిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట GGH సూపరింటెండెంట్ సిద్ధానాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందు, A.O కళారాణి,DM&HO పెంచలయ్య, Deputy Superintendent Orthopaedic Dr.మస్తాన్ బాషా, DCHS రమేష్ నాథ్, APMSIDC EE సుధాకర్ గౌడ్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.