ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించండి-మంత్రి నారాయణ
నెల్లూరు: ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలసి ఇరిగేషన్, విద్యుత్ శాఖలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రెండు రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పనులు ప్రారంభించే ముందే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణ చేయవలసిందిగాను, అదేవిధంగా పనులు పూర్తయ్యాక మరల డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సూచించారు. ఈ విధంగా అనవసర ఆరోపణలకు తావు లేకుండా పనిచేస్తామన్నారు. అలాగే తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నదనటానికి డ్రోన్స్ కెమెరాలను వినియోగించడమే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో అన్ని పనులకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తే నాణ్యత పెరుగుతుందన్నారు. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం:- శుక్రవారం జరిగిన ఐఏబి సమావేశంలో రైతులు, రైతు సంఘాల నాయకులు రైతులకు విద్యుత్తు 7 గంటలు మాత్రమే అందిస్తున్నారని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాలను పరిశీలించిన మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ తో కలసి ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో సమావేశమై కూలంకషంగా చర్చించారు. సమస్య పరిష్కారం కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోను, సెక్రటరీ విజయానంద్ తోను సమావేశం నుండే ఫోన్ ద్వారా వివరించారు..వెంటనే రేపటినుండి రైతులకు 9 గంటల విద్యుత్తుకు, అలాగే 200 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాకి కేటాయించుటకు మంత్రి రవికుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ ఇ విజయన్ తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్ ఇ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.