DISTRICTSEDU&JOBSOTHERS

ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌,మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు-డిఆర్‌వో

141 సెంటర్లలో ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌..

నెల్లూరు: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్‌రావు సూచించారు. బుధవారం డిఆర్‌వో చాంబర్‌లో ఇంటర్‌ పరీక్షలపై కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్‌ ఒకేషనల్‌, 10వ తేదీ నుంచి ఇంటర్‌ జనరల్‌ ప్రాక్టీకల్స్‌ ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సాధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా పత్రాలను జిల్లా కంట్రోల్‌ రూం నుంచి సెంటర్లకు పటిష్ట భద్రత మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు సమకూర్చుకోవాలని, అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగా పర్యవేక్షించాలని ఆర్‌ఐవోకు సూచించారు. ఆర్‌ఐవో శ్రీనివాసరావు:- మాట్లాడుతూ జిల్లాలో 141 సెంటర్లలో ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌, 79 సెంటర్లలో ఇంటర్‌ సాధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌ కు 25782 మంది విద్యార్థులు, ఇంటర్‌ పరీక్షలకు 54200 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే విద్యార్థులు కాల్‌ సెంటర్‌ నెంబరు 0861-2320312లో సంప్రదించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్‌ అడిషనల్‌ కమిషనర్‌ వై.ఒ.నందన్‌, డిఎంఅండ్‌హెచ్‌వో సుజాత, డిఇవో బాలాజీరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయన్‌, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *