విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం-15శాతం వృద్ధితోనే స్వర్ణాంధ్ర-2047 సాధ్యం-సీ.ఎం చంద్రబాబు
ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
అమరావతి: విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే,, దానిని నిలబెట్టుకునేందుకు ఈ 9 నెలల పాలనలో కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లూ తమ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని రాష్ట్రం అధిగమించి అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మొదటిరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి… రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు.26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.
ప్రజా సంక్షేమం మీ బాధ్యత:– సంక్షేమం ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరిస్థాయి వరకు చేరాలి. పౌరులకు అందించే 22 సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. డీఎస్సీ మెగా నోటిఫికేషన్:– ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పగడ్బంధీగా మెగా డీఎస్సీ నిర్వహించాలి. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే మొదటి సంతకం చేశాం. పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలి. విజన్ మనకు ఒక డైరెక్షన్:– స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో 10 సూత్రాలు పొందుపరిచాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు ఉండాల్సిందే. రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి. పర్యావరణ, ఇతర అనుమతులకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. పాలనకు ప్రజామోదం ఉండాలి:– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో 3వ సారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రతి త్రైమాసికానికి ఒక సమావేశం పెట్టుకుని రాబోయే 3 నెలలు ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. ఆదాయంతోనే సంక్షేమం సాధ్యం:– సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అనే మూల స్తంభాలపైనే సుపరిపాలన ఆధార ఉంటుంది.సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలి. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే స్థిరంగా కొనసాగవు. అన్నా క్యాంటీన్‌లు సందర్శించండి:– రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి 204 అన్నా క్యాంటీన్‌లు నెలకొల్పాం. కలెక్టర్‌లు కూడా అన్నాక్యాంటీన్‌లను సందర్శించాలి. ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు సూచించాలి. ఎక్కడా తాగునీరు లేదనే మాట రాకూడదు. 2027 కల్లా పోలవరం నిర్మాణం పూర్తి:– పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడినపెట్టాం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టాం.ప్రజలూ భాగస్వాములయ్యేలా చర్యలు ఉండాలి. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అమరావతితో ప్రారంభమైంది. అమరావతి రాజధానికి కొత్త రైల్వేలైన్‌తో పాటు, విశాఖ రైల్వేజోన్ సాధించాం. ప్రయాణం సాఫీగా సాగేలా రోడ్లు:– గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా గోతులే ఉన్నాయి. అందుకే రూ.861 కోట్లతో 20 వేల కి.మీ మేర గుంతలు పూడ్చివేస్తున్నాం. దాదాపు 95 శాతం మేర పనులు పూర్తయ్యాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీ ఇస్తున్నాయి. జీఎస్డీపీ పెరుగుదల తప్పనిసరి:– విజన్ అమల్లో రాజకీయ ఒత్తిడిలు తలెత్తకుండా జిల్లాలకు స్థానికేతర అధికారులను జిల్లా ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించాం. జిల్లాల్లో సంపద సృష్టికి ఏం చేయగలుగుతారో ఆలోచించాలి. రూ.3.27 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపట్టాం. వచ్చే ఏడాదికి 15 శాతం తగ్గకుండా జీఎస్‌డీపీ సాధించేలా కలెక్టర్‌లు కృషిచేయాలి. వ్యవసాయరంగంపైనా దృష్టి పెట్టాలి:– ఏపీ అంటే ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుంది. జిల్లాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైన దృష్టి పెట్టాలి. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలి. హార్టికల్చర్‌కు సీమలో మంచి అవకాశాలు ఉన్నాయి. బకాయిలు అన్నీ వసూలు చేయాలి:– జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలి. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ శాఖలో ఫిర్యాదుల రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దు. గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపండి. శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్సీలతో కలిసి పనిచేయాలి.