AP&TGDEVOTIONALOTHERS

జూలై 24న తిరుమలలో పల్లవోత్సవం

తిరుమల: మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 24వ తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.

మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం:- శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.

ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ 5 కేజీల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతోంది.

మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *