శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు– టీటీడీ ఈవో జె.శ్యామలరావు
తిరుమల: శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగుళూరు, వేలూరులలోని సమాచార కేంద్రాలలో సెప్టెంబర్ 2వ తేదీ 50 వేలు, సెప్టెంబర్ 3వ తేదీ 13 వేలు సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో తెలిపారు. భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు.