మహానటుడు ఎస్వీ రంగారావు కళాసేవను స్మరించుకుందాం-ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎస్వీ రంగారావు జయంతి..
అమరావతి: మూడు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనతో సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న యశస్వి…మహానటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా, ఆ విశ్వనట చక్రవర్తి కళాసేవను స్మరించుకుందాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఎస్.వి.రంగారావు క్లుప్తంగా:- ఎస్.వి.రంగారావు (సామర్ల వెంకట రంగారావు) (1918 – 1974) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత..కృష్ణా జిల్లా,నూజివీడులో 1918 జూలై 3న తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు.1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు.నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ (1975).