క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్-సీఎం చంద్రబాబు
క్వాంటం టెక్నాలాజీకి…
అమరావతి: ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో తొలి క్వాంటం రెఫరెన్సు ఫెసిలిటీని సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలో ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన 1 క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను సీఎం జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం వర్సిటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎస్ఆర్ఎం నుంచి మేధాటవర్స్‌లోని టెస్ట్ బెడ్ ను వర్చువల్ గా సీఎం ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరం మేధా టవర్స్ లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ఏర్పాటయ్యాయి. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ లాంటి సంస్థలు సహకారంతో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

