175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు-సీ.ఎం చంద్రబాబు
రూల్ ఆఫ్ లా బలంగా ఉండాలి-పవన్ కళ్యాణ్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేలా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను ఆవిష్కరించడం జరిగిందని, ప్రపంచంలోని తెలుగు జాతిని ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వేదికగా జరిగింది.. స్వర్ణాంధ్ర-2047 పది సూత్రాల వృద్ధి సోపానాలతో విలువైన విజన్ సాక్షాత్కరించింది..ఆవిష్కరణ సభకు ముందుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి వివిధ రంగాల్లో సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలు, విద్యార్థులతో కాసేపు మాట్లాడారు..ఈ సందర్బంలో సీ.ఎం చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తూ విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం తమ అకుంఠిత దీక్షకు నిదర్శనమని అన్నారు..
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:- స్వర్ణ ఆంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు 2,854 ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు.. అక్కడ సరైన రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాలకు దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారన్నారు.. ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవన్నారు.. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు, సర్వే రాళ్లు పాతేందుకు రూ.1,200 కోట్లను దుబారా చేసిందన్నారు.. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేసిన నిధులు మన దగ్గర ఉంటే కనీసం 1400 గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం, వైద్య సదుపాయాలు కల్పించే వీలుండేదన్నారు..
కూల్చేయడం తేలిక:- అమెరికాలో ట్విన్ టవర్స్ వంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించడం చాలా కష్టమన్నారు.. వాటిని కూల్చివేసేందుకు తీవ్రవాదులకు నిమిషాలే పట్టిందన్నారు.. ఏ వ్యవస్థ అయినా, నిర్మాణాన్ని అయినా నిర్మించడం చాలా కష్టం…కూల్చేయడం తేలిక… గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలనను మొదలుపెట్టి పూర్తిగా కూలిపోయిందన్నారు…
రూల్ ఆఫ్ లా బలంగా ఉండాలి:- చాలా మంది పెట్టుబడుదారులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉండటం. రూల్ ఆఫ్ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతీ ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ లా సమానంగా ఉండాలి. గోవా గొప్ప పర్యటక ప్రాంతం. ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యటకం మీదనే వస్తోంది. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీరప్రాంతం ఉంది. గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యటకులకు రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత.