‘22A’ చిక్కుల నుంచి భూములకు విముక్తి-కొత్త ఉత్తర్వులు-మంత్రి అనగాని
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై..
రాష్ట్రంలో రీ సర్వే పై చేస్తున్న విమర్శల్లో నిజం లేదు..
అమరావతి: గత ప్రభుత్వ అక్రమాల కారణంగా వేలాదిమంది రైతులు సామాన్య భూ యజమానుల భూములు 22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకుని ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులకు శాశ్వత చరమగీతం పాడుతూ నిషేధిత జాబితా నుండి భూముల తొలగింపును సరళతరం చేస్తూ కొత్త ఉత్తర్వులను జారీ చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని మాట్లాడుతూ ఆస్తుల నిర్వహణకు పారదర్శకమైన విధానం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సరళీకృత విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని దీంతో పేదలకు సామాన్యులకు రైతులకు మరింత ఊరట లభించనుందని అన్నారు.ఈ నూతన ఉత్తర్వులు గతంలో జారీ చేసిన పాత సర్క్యులర్లు అన్నింటినీ రద్దు చేయడంతో పాటు భూ రికార్డుల్లో అక్రమ మార్పులకు ఆస్కారమిచ్చే మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తి పలుకుతుందని అన్నారు.వ్యవసాయ భూములకు సంబంధించి ‘వెబ్‌ల్యాండ్ 2.0’ మాత్రమే ఉంటుందన్నారు.నిషేధిత ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్-అధికారిక డేటాబేస్ నిర్వహణ ఇక రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఐజీ వద్ద ఉంటుందని అన్నారు. 18-06-1954 నాటికి ముందు అసైన్ చేసిన భూములు,సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి దేవాలయాలు లేదా వక్ఫ్ బోర్డుల నుండి చట్టబద్ధంగా వేలంలో కొనుగోలు చేసిన భూములు,విలేజ్ సర్వీస్ ఇనాంలు,షరతులతో కూడిన పట్టా భూములు,పాత కాలంనాటి అన్-అప్రూవ్డ్ లేఅవుట్ల భూములను 22A నిషేధిత జాబితా నుండి పూర్తిగా తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు.అలాగే గ్రామకంఠం భూములు ఎట్టి పరిస్థతుల్లోనూ 22ఏలో పెట్టకూడదన్నారు.ఏపీఎస్ఎఫ్సీ వేలంలో కొన్న భూములు 22ఏలో ఉంటే తొలగించాలని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నామన్నారు.
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతోందంటూ వైసిపి నేతలు చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు.పీపీపీ మోడల్ లో ప్రయివేట్ భాగాస్వామి కేవలం భవనాలు,ఆధునిక ఫర్నిచర్,కంప్యూటర్లు,క్యూ మేనేజ్‌మెంట్ వంటి నాన్-స్టాట్యుటరీ మౌలిక వసతుల కల్పనకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 297 కార్యాలయాల్లో కేవలం జిల్లా కేంద్రాల్లోని 26 ఆఫీసుల్లో మాత్రమే దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నామని తెలిపారు.దస్తావేజుల పరిశీలన,రిజిస్ట్రేషన్లు,స్టాంప్ డ్యూటీ వసూలు,చట్టబద్ధమైన నిర్ణయాధికారాలన్నీ 100 శాతం ప్రభుత్వ సబ్-రిజిస్ట్రార్ పరిధిలోనే ఉంటాయని,డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి,వారి కుటుంబాల ఉపాధికి రూపాయి నష్టం కూడా జరగకుండా ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రీ సర్వే పై చేస్తున్న విమర్శల్లో నిజం లేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రీ సర్వేను తప్పుల తడకగా నిర్వహించిందని ఇప్పటికీ కూడా ఆ తప్పులను సరి చేస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వం రీ సర్వేకు సరైన సమయం ఇవ్వలేదని కానీ కూటమి ప్రభుత్వం పాలనలో రీ సర్వేకు 200కి పైగా రోజులు కేటాయించామని గ్రౌండ్ ట్రూతింగ్ కే 90 రోజులు కేటాయించామని సర్వే అధికారులు వంద రోజుల పాటు గ్రామాల్లోనే ఉండి రీ సర్వేను నిర్వహిస్తున్నారని చెప్పారు.గత ప్రభుత్వం రీ సర్వేకు కేవలం వంద రోజులు మాత్రమే కేటాయించి తప్పుల తడకగా మార్చిందని తమను కూడా అలాగే చేయమని వైసీపీ నాయకులు చెబుతున్నారా అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

