అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మూసివేతకు నోటీసులు-M.H.O వెంకటరమణ
నెల్లూరు: ప్రజారోగ్య పరిరక్షణకు నెల్లూరు నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు, ఇతర ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. M.H.O ప్రత్యేక బృందం స్థానిక మాగుంట లే అవుట్ లోని అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ లో సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ నిర్వహణకు కార్పొరేషన్ నుంచి ఏలాంటి అధికారిక అనుమతులు పొందలేదని, ఎన్.ఓ.సి, ట్రేడ్ లైసెన్సులను పొందకుండానే గత కొంత కాలం నుంచి రెస్టారెంట్ కొనసాగిస్తున్నట్లుగా తనిఖీల్లో గుర్తించారు.రెస్టారెంట్ వంటశాల ఫ్రీజర్ లో ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహార వంటకాలను నిల్వ ఉంచడంతో పాటు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న చికెన్, చేప, మటన్, ఇతర మాంసపు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. కిచెన్ ప్రాంగణంలో ఎలుకలు, పంది కొక్కులు తిరుగాడుతూ వాటి వ్యర్ధాలు సైతం ఆహార పదార్ధాల్లో కలిసేంతగా ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులను డాక్టర్ గుర్తించి నిర్వహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రెస్టారెంట్ మరుగుదొడ్లలో అపరిశుభ్రమైన నిర్వహణ, డైనింగ్ హాల్ లో పాటించాల్సిన ప్రమాణాలలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మూసివేతకు నోటీసులు జారీ చేసిన డాక్టర్ 50 వేల రూపాయలు జరిమానా విధించారు. మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని, వివరణ సంతృప్తికరంగా లేకపోతే రెస్టారెంటును శాశ్వతంగా మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని డాక్టర్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక బృందాలతో క్రమంతప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని, నిబంధనలు పాటించని వ్యాపార వాణిజ్య సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని M.H.O హెచ్చరించారు.