AP&TG

ఈ ఏడాది 1,040 కి.మీ.జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యం-ముఖ్యమంత్రి చంద్రబాబు

జూలై నెలాఖరుకు ఆటంకాలు తొలిగించాలి..

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్నిరాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు NHAI,,MORTH కింద రూ.11,325 కోట్లతో 770 కి.మీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 

రూ.76,856 కోట్లతో 144 ప్రాజెక్టుల నిర్మాణం:- రాష్ట్రంలో మొత్తం 8,744 కి.మీ వరకు రహదారులు ఉండగా… వీటిలో 4,406 కి.మీ మేర NHAI రహదారులు, PIU-ఎంఓఆర్టీహెచ్ పరిధిలో 641 కి.మీ. రహదారులు, అలాగే NH(R&B) కింద 3,697 కి.మీ. రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI,MORTH కింద రూ.76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కి.మీ వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నారు. వీటిలో NHAI కింద 1,392 కి.మీ. రహదారులు, 2,091 కి.మీ MORTH రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం రూ.20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు.

గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్:- గుంతలు లేని రహదారులు కోసం గత ఏడాది నవంబర్‌లో రూ.860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన (Mission Pot hole free Roads) పనుల్లో 97 శాతం ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కి.మీ. మేర రహదారుల్లో గుంతలన్ని పూడ్చి.. మరమ్మతులయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తికానున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *