బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు
అమెరికాకు హెచ్చరిక..
అమరావతి: గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్‌లో వరుస పేలుళ్లు, సైరన్ల మోతతో ఆదివారం భయానక వాతావరణం నెలకొంది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
బహ్రెయిన్‌లోని అల్-రఫా హెలికాప్టర్ స్థావరం వద్ద ఉన్న అమెరికా సైనిక స్థావరంపై 6 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా నుంచి ఎలాంటి దురాక్రమణ జరిగినా గతంలో కంటే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తమై, ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. పేలుళ్లు, సైరన్ల శబ్దాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అమెరికాకు హెచ్చరిక:- ఇదే సమయంలోఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందిస్తూ,, అమెరికా మరోసారి తప్పు చేస్తే పరిణామాలు అదుపు తప్పుతాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? యుద్ధం కొనసాగుతుందా? అనే దానికంటే తమ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో ఒప్పందం కుదరాలంటే ఇరాన్ ప్రతిపాదించిన 7 షరతులను అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే యుద్ధ రంగంలో పరిస్థితులను తమ సాయుధ దళాలే నిర్ణయిస్తాయని అన్నారు.

