MPTC,ZPTC ఎన్నికల సందర్బంగా నవంబర్ 5న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు-కలెక్టర్
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో నవంబర్ 5న నిర్వహించనున్న MPTC,ZPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు నవంబర్ 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించారు. అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు నవంబర్ 5న స్థానిక సెలవు వర్తించనుంది.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నవంబర్ 5న సెలవు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

