AP&TGNATIONAL

అత్యాధునిక నావిగేషన్ ఉపగ్రహం NVS-03 ప్రయోగం విజయవంతం

భారత నావిక్ వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు GSLV-F18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా అత్యాధునిక నావిగేషన్ ఉపగ్రహం NVS-03 ని నింగిలో చేర్చింది. 20 నిమిషాల ప్రయాణం అనంతరం NVS-03 ఉపగ్రహాన్ని నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ ఫర్ ఆర్బిట్‌ (GTO)లోకి ప్రవేశపెట్టింది. GSLV-F18, ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేర్చడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందరం వ్యక్తం చేశారు.

సెకండ్ జనరేషన్ నావిగేషన్:- NVS-03 ఉపగ్రహం ఇస్రో రూపొందిస్తున్న సెకండ్ జనరేషన్ నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో మూడవది. భారతదేశానికి స్వతంత్ర నావిగేషన్ సేవలను అందించే నావిక్ వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు స్థాన నిర్ధారణ, దిశానిర్దేశం, సమయ సమాచార సేవలు అందుతాయి. రవాణా, నౌకాయానం, వాహనాల ట్రాకింగ్, రైల్వేలు, వ్యూహాత్మక కార్యకలాపాలకు ఇవి ఉపయోగపడతాయి.

అటామిక్ క్లాక్‌:- ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అటామిక్ క్లాక్‌ను అమర్చారు.అలాగే విదేశాల నుంచి సేకరించిన అటామిక్ క్లాక్‌లను కూడా ఉపయోగించారు. అటామిక్ క్లాక్ సాయంతో సమయ నిర్ధారణ మరింత ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఉన్న L5, S బ్యాండ్ సిగ్నల్స్‌ కు అదనంగా కొత్తగా L1 సిగ్నల్‌ను కూడా NVS-03లో చేర్చారు. దీనివల్ల నావిక్ వ్యవస్థ సామర్థ్యం పెరగడంతో పాటు వివిధ నావిగేషన్ పరికరాలకు అనుకూలత మెరుగుపడనుంది.

భారత నావిక్ వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది:- NVS-03 ప్రయోగం ద్వారా భారత నావిక్ వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది. గతంలో కొన్ని ఉపగ్రహాల సేవలు, సాంకేతిక సమస్యల కారణంగా ఈ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు NVS-03 విజయవంతంగా కక్ష్యలోకి చేరడంతో మొత్తం నాలుగు ఉపగ్రహాలతో కనీస డేటా సామర్థ్యం పునరుద్ధరించబడిందని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. భారతదేశానికి స్వతంత్రంగా స్థాన నిర్ధారణ, నావిగేషన్, సమయ సేవలు అందించడంలో నావిక్ కీలకమైన జాతీయ ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. రైళ్లు, వాహనాలు, నౌకల రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి పౌర అవసరాలకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *