సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తించదు-నాదెండ్ల మనోహర్
ఎన్డీఏ కూటమి గెలుపుకోసం త్యాగాలు చేశాం..
కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు..
అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని, అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని తెలిపారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో:- ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…“జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తాం. ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతాం అన్నారు.

