సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి నిర్మాలాసీతారామన్ సహకారం-సీ.ఎం చంద్రబాబు
చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం-నిర్మలా సీతారామన్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పలనాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్ధిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి (క్రెడిట్ అవుట్ రీచ్) కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలనాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను అందజేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. వీబీజీ రామ్ జీ కింద కేంద్రం నుంచి రూ.7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం రూ.40 వేల కోట్లు ఆర్ధిక సహకారం అందిస్తుందన్నారు.
చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం-కేంద్ర మంత్రి:- దేశంలోని ప్రతి గ్రామంలోనూ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని గుర్తుచేశారు. చిన్న వ్యాపారుల ఆర్థిక కష్టాలను గుర్తించిన ప్రధాని మోదీ.. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి సులభంగా రుణాలు అందేలా పథకాలు తెచ్చారని వివరించారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మెగా రుణమేళాలో భాగంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి రుణ మంజూరు పత్రాలను, చెక్కులను అందజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేత:- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.42.16 లక్షల విలువైన అంబులెన్స్ ను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అలాగే నాబార్డు సౌజన్యంతో డీసీసీబీ (DCCB) కి రూ.25 లక్షల విలువైన 2 మొబైల్ డెమో వ్యాన్లు అందించారు. అలాగే విద్యార్థినులకు రూ.17.80 లక్షల విలువైన 301 సైకిళ్లను పంపిణీ చేశారు. పర్యాటక శాఖకు గ్రామీణ బ్యాంక్ తరపున రూ.14 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందించారు. వీటిని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎంపీలు,అధికారులు పాల్గొన్నారు.

