రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను 54% నుంచి 35%కు తగ్గించాలి-మంత్రి సత్యకుమార్
సిజేరియన్లలో రాష్ట్రానికి 4వ స్థానం..
ప్రతి సిజేరియన్కూ కారణాలు చూపాలి..
ప్రభుత్వాసుపత్రుల్లో డయాగ్నస్టిక్..
అమరావతి: ప్రతి మహిళా జీవితంలో ప్రసవం సమయంలో సిజేరియన్ ఆపరేషన్లు తాత్కాలికంగా ఉపశమనాన్ని కల్పించినా తల్లీబిడ్డలకు అది ప్రయోజనకరం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎక్కువ శాతంలో జరుగుతోన్న సిజేరియన్లపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. సిజేరియన్లు, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో శుక్రవారం సంబంధిత ఉన్నతాదికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ అసుపత్రుల్లో జరుగుతోన్న మొత్తం ప్రసవాల్లో 51% సిజేరియన్లు జరగడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని మూడేళ్ల (2028-29)లో నాటికి 35%కు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
సిజేరియన్లలో రాష్ట్రానికి 4వ స్థానం:- దేశం (2025-26)లో 30.13% సిజేరియన్లు జరగ్గా ఈ విషయంలో 53.85%తో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండటం ఆమోదయోగ్యం కాదని మంత్రి స్పష్టంచేశారు 57.50% సిజేరియన్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా 55.40% తో జమ్మూ అండ్ కాశ్మీర్ రెండోస్థానంలో, తమిళనాడు 54.92% తో మూడో స్థానంలో ఉన్నాయి 2025-26లో రాష్ట్రంలో మొత్తం 5,20,680 ప్రసవాలు జరగ్గా ఇందులో 2,80,318 సిజేరియన్ కింద నమోదయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో 40.31% సిజేరియన్లు జరుగుతుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ స్థాయిలో 63.84% జననాలు సిజేరియన్ల ద్వారా జరుగుతున్నాయి.
వైద్య నిర్ధారణ పరీక్షలకు టోకెన్లు:- ప్రభుత్వాసుపత్రుల్లో నిరంతరం పెరుగుతోన్న ఓపీ, ఐపీ సేవల కారణంగా వైద్య నిర్ధారణ (డయాగ్నస్టిక్ టెస్టు) పరీక్షలకు డిమాండ్ పెరిగి రోగులు గంటలకొద్దీ వేచి ఉండటంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు వారంరోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ దిశగా ప్రతి రోగికి టోకెన్లు ఇచ్చి, ముందుగా వచ్చిన వారికి ముందుగా నిర్దిష్ట సమయంలో పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
డయాగ్నస్టిక్ పరికరాల వినియోగంలో భారీ వ్యత్యాసమెందుకు?:- ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య నిర్ధారణ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేసిన యంత్రాలు, పీపీపీ ద్వారా సేవలు అందిస్తున్న యంత్రాల వినియోగంలో భారీ వ్యత్యాసంపట్ల మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఒక సీటీ స్కాన్ యంత్రం రోజుకి 15 మంది రోగులకు పరీక్షలు చేయాలని ప్రామాణీకరించగా ప్రభుత్వం నిర్వహించే మెషిన్ ద్వారా సగటున 34 పరీక్షలు చేస్తుండగా పీపీపీ కింద నడిచే ప్రతి మెషిన్ ద్వారా 78 స్కాన్లు చేస్తున్నట్లు మంత్రి గమనించారు ఎమ్మారై స్కాన్లకు సంబంధించి ఈ వివరాలు 7, 8, 25గా వెల్లడయ్యాయి. యాంజియోగ్రామ్ విషయంలో ఈ విలువలు 15, 10, 19 చొప్పున ఉన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు

